Logo

తీతుకు అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము.

02 ఏలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులును, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేనివారునై యుండవలెననియు,

03 ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులు గలవారై యుండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు,

04 యౌవన స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు,

05 మంచి ఉపదేశము చేయువారునై యుండవలెననియు బోధించుము.

06 అటువలెనే స్వస్థబుద్ది గలవారై యుండవలెనని యౌవన పురుషులను హెచ్చరించుము.

07 పరపక్షమందుండువాడు మనలనుగూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము.

08 నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.

09 దాసులైనవారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక,

10 ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము.

11 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణ కరమైన దేవుని కృప ప్రత్యక్షమై

12 మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,

13 అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది

14 ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

15 వీటినిగూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్భోధను ఖండించుచునుండుము నిన్నెవనిని తృణీకరింప నీయకుము.