Logo

హెబ్రీయులకు అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.

02 ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా

03 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,

04 దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలచేతను, మహత్కార్య ములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.

05 మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు.

06 అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?

07 నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి నీచేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి.

08 ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని

09 దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించినవానిగా ఆయనను చూచుచున్నాము

10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

11 పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక

12 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానముచేతును అనెను.

13 మరియు నేనాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.

14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును,

15 జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

16 ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.

17 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడైయున్నాడు.