Logo

హెబ్రీయులకు అధ్యాయము 9

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మొదటి నిబంధనకైతే సేవానియమములును ఈ లోక సంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను.

02 ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.

03 రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.

04 అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోనుచేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను

05 దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.

06 ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని

07 సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధానయాజకుడొక్కడే రక్తముచేతపట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.

08 దీనినిబట్టి ఆ మొదటి గుడారమింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు.

09 ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.

10 ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి.

11 అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా

12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

13 ఏలయనగా మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,

14 నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.

15 ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమునుగూర్చిన వాగ్దానమును పొందునిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైయున్నాడు.

16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.

17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?

18 ఇందుచేత మొదటి నిబంధన కూడ రక్తము లేకుండ ప్రతిష్ఠింపబడలేదు.

19 ధర్మశాస్త్రప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసికొని

20 దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.

21 అదేవిధముగా గుడారము మీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను.

22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.

23 పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలులవలన శుద్ధిచేయబడవలసి యుండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటె శ్రేష్ఠమైన బలులవలన శుద్ధిచేయబడవలసి యుండెను.

24 అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలొకమందే ప్రవేశించెను

25 అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు

26 అట్లయినయెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకై యొక్కసారే ప్రత్యక్షపరచబడెను

27 మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.

28 ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండ రెండవసారి ప్రత్యక్షమగును.