Logo

యాకోబు అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.

02 అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన (కళ్లెము పెట్టుకుని) శక్తిగలవాడగును

03 గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెము పెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

04 ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును.

05 ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

06 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.

07 మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతిచేత సాధు కాజాలును, సాధు ఆయెను గాని

08 యే నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

09 దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.

10 ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.

11 నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదు నీరును ఊరునా?

12 నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పునీళ్లలో నుండి తియ్యని నీళ్లును ఊరవు.

13 మీలో జ్ఞానవివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.

14 అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

15 ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానమువంటిదియునైయున్నది.

16 ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునైయున్నది

18 నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.