Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 13

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి

02 నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినయెడల

03 అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు.

04 మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలననుసరించి ఆయన మాటవిని ఆయనను సేవించి ఆయనను హత్తుకొనియుండవలెను.

05 నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.

06 నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమారుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని

07 భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగానుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించినయెడల

08 వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలిపడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.

09 చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను.

10 రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తు దేశములోనుండియు దాస్యగృహములోనుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు.

11 అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు.

12 నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురములలో ఏదో యొకదానియందు

13 పనికిమాలిన కొందరు మనుష్యులు నీమధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను.

14 అది నిజమైనయెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగినయెడల

15 ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి, దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను.

16 దాని కొల్లసొమ్మంతటిని విశాలవీధిలో చేర్చి, నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్లసొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను. అది తిరిగి కట్టబడక యెల్లప్పుడును పాడుదిబ్బయై యుండును.

17 నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచు

18 నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైనదాని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్నినుండి మళ్లుకొని నీయందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణముచేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీయొద్ద ఉంచుకొనకూడదు.