Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 25

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చునప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషియనియు తీర్పు తీర్చవలెను.

02 ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినయెడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరముకొలది దెబ్బలు లెక్కపెట్టి తనయెదుట వాని కొట్టింపవలెను.

03 నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో.

04 నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు.

05 సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెనిమిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.

06 చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను.

07 అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లనియెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దలయొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలెను.

08 అప్పుడు అతని యూరిపెద్దలు అతని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టములేదనినయెడల అతని సహోదరుని భార్య

09 ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మివేసి తన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయబడునని చెప్పవలెను.

10 అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును.

11 మనుష్యులు ఒకనితోనొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్నవాని చేతిలోనుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకొనినయెడల ఆమెచేతిని ఛేదింపవలెను.

12 నీ కన్ను కటాక్షింపకూడదు.

13 హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూనికెరాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.

14 హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు.

15 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికెరాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను.

16 ఆలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయముచేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు.

17 మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసినదానిని జ్ఞాపకము చేసికొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి

18 నీవు ప్రయాసవడి అలసియున్నప్పుడు నీవారిలో నీ వెనుకనున్న బలహీనులనందరిని హతముచేసెను.

19 కాబట్టి నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండచేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రిందనుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు.