Logo

1పేతురు అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్నయెడల

02 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణమాటలను మాని,

03 క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

04 మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

05 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

06 ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

07 విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.

08 కట్టువారు వాక్యమునకవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.

09 అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ద జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు

10 ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

11 ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12 అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను

13 మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.

14 రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి.

15 ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.

16 స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడియుండుడి.

17 అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.

18 పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి.

19 ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షి కలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును.

20 తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును;

21 ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.

22 ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

23 ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.

24 మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.

25 మీరు గొఱ్ఱలవలె దారి తప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.