Logo

1పేతురు అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;

02 అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.

03 జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,

04 సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.

05 అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడి యుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.

06 ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరక యున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.

07 అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి

08 తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

09 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

11 అతడు కీడునుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.

12 ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

13 మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు?

14 మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి;

15 నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;

16 అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు.

17 దేవుని చిత్తమాలాగున్నయెడల కీడుచేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది.

18 ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు,

19 ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.

20 దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణ పొందిరి.

21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.

22 ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.