Logo

2పేతురు అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.

02 తన మహిమను బట్టియు, గుణాతిశయమును బట్టియు, మనలను పిలిచినవానిగూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున,

03 దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.

04 ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను

05 ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,

06 జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని,

07 భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.

08 ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును.

09 ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును.

10 అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.

11 ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.

12 కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.

13 మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చునని యెరిగి,

14 నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.

15 నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసికొనునట్లు జాగ్రత్తచేతును.

16 ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని

17 ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితివిు. ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా

18 మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడ ఉండినవారమై, ఆ శబ్దము ఆకాశమునుండి రాగా వింటిమి.

19 మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.

20 ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.

21 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.