Logo

1యోహాను అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.

02 ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు; మన పాపములకు మాత్రమే కాదు. సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు.

03 మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము.

04 ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.

05 ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;

06 ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.

07 ప్రియులారా, మొదటనుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు; ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే.

08 మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే.

09 వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనేయున్నాడు.

10 తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు.

11 తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు.

12 చిన్నపిల్లలారా, ఆయన నామముబట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను.

13 తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.

14 చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.

15 ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.

16 లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.

17 లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.

18 చిన్నపిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.

19 వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలువెళ్లిరి.

20 అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.

21 మీరు సత్యమెరుగనివారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని యెరిగియున్నందునను మీకు వ్రాయుచున్నాను.

22 యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.

23 కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు.

24 అయితే మీరు మొదటనుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదటనుండి వినినది మీలో నిలిచినయెడల, మీరు కూడ కుమారుని యందును తండ్రి యందును నిలుతురు.

25 నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము,

26 మిమ్మును మోసపరచువారినిబట్టి యీ సంగతులు మీకు వ్రాసియున్నాను.

27 అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు భోదించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు భోదించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు (నిలిచియుండుడి).

28 కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయనయందు నిలిచియుండుడి.

29 ఆయన నీతిమంతుడని మీరెరిగియున్నయెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురు.