Logo

ప్రకటన అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ గొఱ్ఱపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.

02 మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీటమియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలువెళ్లెను.

03 ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని

04 అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను

05 ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.

06 మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయవద్దనియు, ఆ నాలుగు జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.

07 ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.

08 అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళలోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను మరణమువలనను (లేక తెగులువలనను) భూమిలోనుండి క్రూరమృగములవలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికియ్యబడెను

09 ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.

10 వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.

11 తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికియ్యబడెను; మరియు--వారివలెనే చంపబడబోవువారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.

12 ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,

13 పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను.

14 మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.

15 భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను

16 బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్నవాని యొక్కయు గొఱ్ఱపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?

17 మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు.