Logo

ప్రకటన అధ్యాయము 13

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.

02 నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.

03 దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి.

04 ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి.

05 డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను

06 గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.

07 మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆ యా భాషలు మాటలాడువారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను.

08 భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.

09 ఎవడైనను చెవి గలవాడైతే వినునుగాక;

10 ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.

11 మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకి వచ్చుట చూచితిని. గొఱ్ఱపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడుచుండెను;

12 అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బ తగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది

13 అది ఆకాశమునుండి భూమికి మనుష్యుల యెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.

14 కత్తిదెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.

15 మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయనివారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.

16 కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనునట్లును,

17 ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది.

18 బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానము కలదు.