Logo

ప్రకటన అధ్యాయము 18

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను.

02 అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెను మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను

03 ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి.

04 మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండు నట్లును దానిని విడిచి రండి.

05 దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.

06 అది యిచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.

07 అది నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి

08 అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడెను

09 దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు

10 దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు--అయ్యో, అయ్యో, బబులోను మహా పట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెనుగదా అని చెప్పుకొందురు.

11 లోకములోని వర్తకులును, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను, అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నారబట్టలు ఊదా రంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరకులను,

12 ప్రతి విధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను,

13 దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తని పిండి గోదుమలు పశువులు గొఱ్ఱలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు;

14 నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించిపోయినవి, అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు.

15 ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు

16 అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహా పట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడై పోయెనే అని చెప్పుకొనుచు దాని భాదను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచుందురు

17 ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహనధూమమును చూచి

18 ఈ మహా పట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి

19 తమ తలలమీద దుమ్ము పోసికొని యేడ్చుచు దుఃఖించుచు అయ్యో, అయ్యో, ఆ మహా పట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి.

20 పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు.

21 తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహా పట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.

22 నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లనగ్రోవి ఊదువారి యొక్కయు బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటి ధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు,

23 దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.

24 మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమిమీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.