Logo

ప్రకటన అధ్యాయము 21

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.

02 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవునియొద్దనుండి దిగివచ్చుట చూచితిని.

03 అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

04 ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

05 అప్పుడు సింహాసనాసీనుడై యున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు--ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు

06 మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.

07 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనైయుందును అతడు నాకు కుమారుడై యుండును.

08 పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

09 అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతొ చెప్పి

10 ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవునియొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.

11 దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.

12 ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.

13 తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపు వైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపు వైపున మూడు గుమ్మములున్నవి.

14 ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులు గలది, ఆ పునాదుల పైన గొఱ్ఱపిల్ల యొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.

15 ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడువానియొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.

16 ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.

17 మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబది నాలుగు మూరలైనది; ఆ కొలత దూత కొలతయే.

18 ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది.

19 ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి యుండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ,

20 అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము,

21 దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.

22 దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.

23 ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము.

24 జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొని వత్తురు.

25 అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.

26 జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.

27 గొఱ్ఱపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.