Logo

రూతు అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు.

02 మోయాబీయురాలైన రూతు నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమెనా కూమారీ పొమ్మనెను.

03 కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది.

04 బోయజు బేత్లెహేమునుండి వచ్చి యెహోవా మీకు తోడై యుండును గాకని చేను కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి.

05 అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా

06 కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశమునుండి నయోమితో కూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యౌవనురాలు.

07 ఆమె నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను, కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను.

08 అప్పుడు బోయజు రూతుతో నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.

09 వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహమగునప్పుడు కుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను.

10 అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను.

11 నీవు నీ తలిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి.

12 యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమె కుత్తరమిచ్చెను.

13 అందుకు ఆమె నా యేలిన వాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమగలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను.

14 బోయజు భోజనకాలమున నీ విక్కడికి వచ్చి భోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయువారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను.

15 ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి

16 మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె యేరుకొనునట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞాపించెను.

17 కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను.

18 ఆమె వాటిని ఎత్తికొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె యేరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తిపొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను.

19 అంతట ఆమె అత్త ఆమెతో­నేడు నీవెక్కడ ఏరుకొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవనియొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి ఎవని యద్ద నేడు పనిచేసితినో అతని పేరు బోయజు అనెను.

20 నయోమి బ్రదికియున్న వారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా

21 మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పని వారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను.

22 అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారీ, అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడకపోవుట మంచిదనెను.

23 కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియువరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెలయొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివసించెను.