Logo

రూతు అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 బోయజు పురద్వారము నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు ఓయి, యీతట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను.

02 బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి.

03 అతడు మోయాబు దేశమునుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొక సంగతి తెలియజేయవలెనని యున్నాను.

04 ఈ పుర నివాసుల యెదుటను నా జనుల పెద్దల యెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనినయెడల విడిపింపుము, దాని విడిపింపనొల్లనియెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు నేను విడిపించెదననెను.

05 బోయజు నీవు నయోమిచేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలియొద్దనుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా

06 ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.

07 ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమునుగూర్చిగాని, క్రయవిక్రయములనుగూర్చిగాని, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాని కిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను.

08 ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా

09 బోయజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమిచేతినుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు.

10 మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయినవాని పేరు అతని సహోదరులలోనుండియు, అతని స్థలము యొక్క ద్వారమునుండియు కొట్టివేయబడక యుండునట్లును, నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసికొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను ప్రజలందరితోను చెప్పెను.

11 అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలును మేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;

12 ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక; యెహోవా యీ యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండును గాక అనిరి.

13 కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసికొని ఆమెయొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను.

14 అప్పుడు స్త్రీలుఈ దినమున నీకు బంధువుడు లేకుండ చేయని యెహోవా స్తుతినొందు గాక; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక.

15 నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.

16 అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసికొని కౌగిటనుంచుకొని వానికి దాదిగా నుండెను.

17 ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రియైన యెష్షయియొక్క తండ్రి.

18 పెరెసు వంశావళి యేదనగా పెరెసు హెస్రోనును కనెను,

19 హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను,

20 నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,

21 బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను.

22 యెష్షయి దావీదును కనెను.