Logo

1సమూయేలు అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 బాలుడైన సమూయేలు ఏలీ యెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు.

02 ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తనస్థలమందు పండుకొనియుండగాను

03 దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొనియుండగాను

04 యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి

05 ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను.

06 యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను.

07 సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు.

08 యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి

09 నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచిన యెడల యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను.

10 తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలూ సమూయేలూ, అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ యిమ్మనెను.

11 అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోవుచున్నాను; దానిని వినువారందరి చెవులు గింగురుమనును.

12 ఆ దినమున ఏలీయొక్క యింటివారిని గురించి నేను చెప్పినదంతయు వారిమీదికి రప్పింతును. దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును.

13 తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.

14 కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని.

15 తరువాత సమూయేలు ఉదయమగువరకు పండుకొని, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని, భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను.

16 అయితే ఏలీ సమూయేలూ నా కుమారుడా, అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేనిక్కడ ఉన్నాననెను.

17 ఏలీ నీతో యెహోవా యేమి సెలవిచ్చెనో మరుగుచేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైన నీవు మరుగు చేసినయెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా

18 సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చినవాడు యెహోవా; తన దృష్ఠికి అనుకూలమైనదానిని ఆయన చేయునుగాక అనెను.

19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.

20 కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి

21 మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కుచేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడియాయెను.