Logo

1సమూయేలు అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి.

02 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులమీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే యెక్కువ తక్కువ నాలుగు వేలమంది హతులైరి.

03 కాబట్టి జనులు పాళెములోనికి తిరిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసికొని మన మధ్య నుంచుకొందము రండి; అది మన మధ్య నుండినయెడల అది మన శత్రువుల చేతిలోనుండి మనలను రక్షించుననిరి.

04 కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూబుల మధ్య ఆసీనుడైయుండు సైన్యములకధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి.

05 యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరు భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి.

06 ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని యేమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలిసికొని

07 జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకుమునుపు వారీలాగు సంభ్రమింపలేదు,

08 అయ్యయ్యో మహా శూరుడగు ఈ దేవుని చేతిలోనుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్లచేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా.

09 ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండ బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి.

10 ఫిలిష్తీయులు యుద్దము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను.

11 మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క యిద్దరు కుమారులు హతులైరి.

12 ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలోనుండి పరుగెత్తివచ్చి, చినిగిన బట్టలతోను తలమీద ధూళితోను షిలోహులో ప్రవేశించెను.

13 అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవ ప్రక్కను పీఠముమీద కూర్చుండి యెదురు చూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరు కేకలు వేసిరి.

14 ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు యేమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను.

15 ఏలీ తొంబది యెనిమిదేండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను.

16 ఆ మనుష్యుడు యుద్ధములోనుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములోనుండి పరుగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు నాయనా, అక్కడ ఏమి జరిగెనని అడిగెను.

17 అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి; జనులలో అనేకులు హతులైరి; హొఫ్నీ ఫీనెహాసు అను నీ యిద్దరు కుమారులు మృతులైరి; మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను

18 దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీదనుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయెను; ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహియై యుండెను. అతడు నలువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను.

19 ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవుని యొక్క మందసము పట్టబడెననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్లమీదికి క్రుంగి ప్రసవమాయెను.

20 ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై

21 దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు1 అను పేరు పెట్టెను.

22 దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను.