Logo

1సమూయేలు అధ్యాయము 17

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని శోకోలో కూడి ఏఫెస్దమ్మీము దగ్గర శోకోకును అజేకాకును మధ్యను దిగియుండగా

02 సౌలును ఇశ్రాయేలీయులును కూడివచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయుల కెదురుగ యుద్ధపంక్తులు తీర్చిరి.

03 ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతముమీదను ఇశ్రాయేలీయులు ఈతట్టు పర్వతముమీదను నిలిచియుండగా ఉభయుల మధ్యను ఒక లోయయుండెను.

04 గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులోనుండి బయలుదేరుచుండెను. అతడు ఆరుమూళ్ల జేనెడు ఎత్తు మనిషి.

05 అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదువేల తులముల రాగి యెత్తుగలది.

06 మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి యుండెను.

07 అతని యీటె కఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటె కొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను.

08 అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి యుద్ధపంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి?నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులుకారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నాయొద్దకు పంపుడి;

09 అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన యెడల మేము మీకు దాసులమగుదుము; నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు.

10 ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను.

11 సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి.

12 దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండుగురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడైయుండెను.

13 అయితే యెష్షయి యొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,

14 దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని

15 దావీదు బేత్లెహేములో తన తండ్రి గొఱ్ఱలను మేపుచు సౌలునొద్దకు తిరిగిపోవుచు వచ్చుచు నుండెను.

16 ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను.

17 యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము.

18 మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొనిపోయి వారి సహస్రాధిపతి కిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొనిరమ్మని చెప్పి పంపివేసెను.

19 సౌలును వారును ఇశ్రాయేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా

20 దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి.

21 సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్నద్ధులై బయలుదేరుచుండిరి.

22 దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులనడిగెను.

23 అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటలచొప్పున పలుకగా దావీదు వినెను.

24 ఇశ్రాయేలీయులందరు ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని యెదుటనుండి పారిపోగా

25 ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటివారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా

26 దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించినవానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారినడుగగా

27 జనులు వాని చంపినవానికి ఇట్లిట్లు చేయబడునని అతని కుత్తరమిచ్చిరి.

28 అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితో నీవిక్కడికెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱమందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివనెను.

29 అందుకు దావీదు నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి

30 అతని యొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆ ప్రకారమే యడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి.

31 దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను.

32 ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరి మనస్సును క్రుంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా

33 సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను.

34 అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱపిల్లను ఎత్తికొని పోవుచుండగ.

35 నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని.

36 మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు,

37 సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు పొమ్ము; యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను.

38 పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవచము తొడిగించెను.

39 ఈ సామగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్లకలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి

40 తన కఱ్ఱ చేతపట్టుకొని యేటి లోయలోనుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను.

41 డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి

42 చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను.

43 ఫిలిష్తీయుడు కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను.

44 నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగముల కును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీ యుడు దావీదుతో అనగా

45 దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.

46 ఈ దినమున యెహోవా నిన్ను నాచేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును.

47 అప్పుడు యెహోవా కత్తిచేతను ఈటెచేతను రక్షించువాడు కాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మాచేతికి అప్పగించునని చెప్పెను.

48 ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి

49 తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను.

50 దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను.

51 వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి.

52 అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచి జయము జయమని అరచుచు లోయవరకును షరాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి.

53 అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగివచ్చి వారి డేరాలను దోచుకొనిరి.

54 అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను.

55 సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ, ఈ యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను.

56 అందుకు రాజు ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

57 దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను.

58 సౌలు అతనిని చూచి చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగా దావీదు నేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను.