Logo

1సమూయేలు అధ్యాయము 18

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.

02 ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనియ్యక సౌలు అతనిని చేర్చుకొనెను.

03 దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసికొనెను.

04 మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదున కిచ్చెను.

05 దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి, సుబుద్ధి గలిగి పని చేసికొనివచ్చెను గనుక సౌలు యోధులమీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై యుండెను.

06 దావీదు ఫిలిష్తీయుని హతముచేసి తిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలోనుండి తంబురలతోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి

07 ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి.

08 ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అనుకొనెను

09 కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపు చూపు నిలిపెను.

10 మరునాడు దేవుని యొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా1 దావీదు మునుపటిలాగున వీణ చేతపట్టుకొని వాయించెను.

11 ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించుకొనెను.

12 యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను.

13 కాబట్టి సౌలు అతని తనయొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేసెను; అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండెను.

14 మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధిగలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగానుండెను.

15 దావీదు మిగుల సుబుద్ధిగలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి యధికముగా అతనికి భయపడెను.

16 ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు, పోవుచు నుండుటచేత వారు అతనిని ప్రేమింపగా

17 సౌలు నా చెయ్యి వానిమీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వానిమీద పడును గాక అనుకొని దావీదూ, నా పెద్ద కుమార్తెయైన మేరబును నీకిత్తును; నీవు నా పట్ల యుద్ధశాలివై యుండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను.

18 అందుకు దావీదు రాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను.

19 అయితే సౌలు కుమార్తెయైన మేరబును దావీదునకు ఇయ్యవలసి యుండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలుకిచ్చి పెండ్లి చేసెను.

20 అయితే తన కుమార్తెయైన మీకాలు దావీదు మీద ప్రేమ గలిగియుండగా సౌలు విని సంతోషించి,

21 ఆమె అతనికి ఉరిగానుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతనిమీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి

22 తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాటలాడి రాజు నీయందు ఇష్టము గలిగియున్నాడు, అతని సేవకులందరును నీయెడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.

23 సౌలు సేవకులు ఆ మాటలనుబట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై యెన్నిక లేనివాడనై యుండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా? అని వారితో అనగా

24 సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి.

25 అందుకు సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను.

26 సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై

27 గడువు దాటకమునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందల మందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను.

28 యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు, తన కుమార్తెయైన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి

29 దావీదునకు మరి యెక్కువగా భయపడి, యెల్లప్పుడును దావీదు మీద విరోధముగా ఉండెను.

30 ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరి నప్పుడెల్లను దావీదు బహు వివేకము గలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటె అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను.