Logo

1సమూయేలు అధ్యాయము 21

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను; అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడుగగా

02 దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీ కాజ్ఞాపించి పంపిన పని యేదో అదెవనితోనైనను చెప్పవద్దనెను; నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని;

03 నీయొద్ద ఏమియున్నది? అయిదు రొట్టెలుగాని మరేమియుగాని యుండినయెడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా

04 యాజకుడు సాధారణమైన రొట్టె నాయొద్ద లేదు; పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను.

05 అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటినుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే యున్నారు; పనివారి బట్టలు పవిత్రములే; ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైనయెడల నేమి? రాజాజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను.

06 అంతట యెహోవా సన్నిధినుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చనిరొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చెను.

07 ఆ దినమున సౌలుయొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను; అతని పేరు దోయేగు, అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పసులకాపరులకు పెద్ద

08 రాజు పని వేగిరముగా జరుగవలెనని యెరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీయొద్ద ఖడ్గమైనను ఈటెయైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకు నడుగగా

09 యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాని తీసికొనుటకు నీకిష్టమైనయెడల తీసికొనుమనగా దావీదు దానికి సమమైనదొకటియు లేదు, నాకిమ్మనెను.

10 అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషునొద్దకు వచ్చెను.

11 ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేలకొలది హతముచేసెననియు, దావీదు పదివేలకొలది హతముచేసెననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే గదా అని అతనినిబట్టి రాజుతో మాటలాడగా

12 దావీదు ఈ మాటలు తన మనస్సులోనుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను.

13 కాబట్టి దావీదు వారియెదుట తన చర్య మార్చుకొని వెఱ్ఱివానివలె నటించుచు, ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డముమీదికి కారనిచ్చుచు నుండెను. వారతని పట్టుకొనిపోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచు వచ్చెను.

14 కావున ఆకీషు రాజుమీరు చూచితిరి కదా? వానికి పిచ్చిపట్టినది, నాయొద్దకు వీనినెందుకు తీసికొని వచ్చితిరి?

15 పిచ్చిచేష్టలు చేయువారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చిచేష్టలు చేయుటకు వీని తీసికొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా? అని తన సేవకులతో అనెను.