Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 10

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి.

02 ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును మల్కీషూవను హతముచేసిరి.

03 యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయములనొందెను.

04 అప్పుడు సౌలుఈ సున్నతిలేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండ నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములను మోయువానితోననగా, వాడు బహుగా భయపడి ఆలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తిమీదపడెను.

05 సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసికొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను.

06 ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటివారందరును చచ్చిరి.

07 జనులు పారిపోయిరనియు, సౌలును అతని కుమారులును చనిపోయిరనియు, లోయలోని ఇశ్రాయేలీయులందరు తెలిసికొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి.

08 హతులైనవారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులును గిల్బోవ పర్వతమందు చచ్చి పడియుండుట చూచి

09 అతని కవచమును దోచుకొని, అతని తలను అతని ఆయుధములను తీసికొనిపోయి ఫిలిష్తీయుల దేశమంతట వాటిని త్రిప్పి, జరిగినదానిని విగ్రహములకును జనులకును చాటించిరి.

10 వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి.

11 ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదువారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరును లేచిపోయి,

12 సౌలు శవమును అతని కుమారుల శవములను తీసికొని యాబేషునకువచ్చి వారి యెముకలను యాబేషునందలి సిందూరవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి.

13 ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచములయొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హతమాయెను.

14 అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను.