Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 17

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దావీదు తన యింటనుండి ప్రవక్తయైన నాతానును పిలిపించి నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధన మందసము తెరలచాటున నున్నదని చెప్పగా

02 నాతాను దేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను.

03 ఆ రాత్రియందు దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

04 నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా నా నివాసమునకై యొక ఆలయము కట్టించుట నీచేత కాదు.

05 ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు నేను ఒక యింటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని.

06 నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నాకొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటిరేమి యని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాటయైన పలికియుంటినా?

07 కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై యుండునట్లు, గొఱ్ఱలవెంబడి తిరుగుచున్న నిన్ను గొఱ్ఱల దొడ్డినుండి తీసికొని

08 నీవు వెళ్లిన చోట్లనెల్ల నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవారిని నీ ముందర నిలువనియ్యక నిర్మూలము చేసితిని; లోకములోని ఘనులకు కలిగియున్న పేరువంటి పేరు నీకు కలుగజేయుదును

09 మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు, పూర్వమందు జరిగినట్లును, నా జనులైన ఇశ్రాయేలీయులమీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచు వచ్చినట్లును, దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు;

10 నీ పగవారినందరిని నేను అణచివేసెదను. అదియు గాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని.

11 నీ జీవితదినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను.

12 అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను.

13 నేను అతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడైయుండును; నీకంటె ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను.

14 నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము.

15 నాతాను తనకు ప్రత్యక్షమైనదానిబట్టి యీ మాటలన్నిటిని దావీదునకు తెలియజేయగా

16 రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? నా యిల్లు ఏమాత్రపుది?

17 దేవా, యిది నీ దృష్టికి స్వల్ప విషయమే; దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలమువరకు నీ సేవకుని సంతతినిగూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాటలాడునట్లు దయ పాలించి నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందునని మాట యిచ్చియున్నావు.

18 నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతనుగూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు.

19 యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారము ఈ మహా ఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు.

20 యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు.

21 నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి

22 నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీవాలాగున చేసితివి; యెహోవావైన నీవు వారికి దేవుడవై యున్నావు

23 యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక.

24 ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక; మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ యెదుట స్థిరపరచబడునుగాక.

25 దేవా నీకు సంతతి కలుగజేసెదనని నీ దాసునికి నీవు తెలియజేసియున్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను.

26 యెహోవా, నీవు దేవుడవైయుండి నీ దాసునికి ఈ మేలు దయచేసెదనని సెలవిచ్చియున్నావు.

27 ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించియున్నావు. యెహోవా, నీవు ఆశీర్వ దించినయెడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి యుండును. ఇదియైన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి,