Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 19

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇదియైన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను.

02 అప్పుడు దావీదు హానూను తండ్రియైన నాహాషు నాయెడల దయచూపించెను గనుక నేను అతని కుమారునియెడల దయచూపెదనని యనుకొని, అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు

03 అమ్మోనీయుల యధిపతులు హానూనుతో నిన్ను పరామర్శించుటకై నీయొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని ఘనపరచుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకేగదా అతని సేవకులు నీయొద్దకు వచ్చియున్నారు అని మనవి చేయగా

04 హానూను దావీదు సేవకులను పట్టుకొని, వారిని గొరిగించి, వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను.

05 ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరువచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి; వారు బహు లజ్జాక్రాంతులై యుండిరిగనుక వారికి ఎదురుగా మనుష్యులను పంపి మీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానమంపెను.

06 అమ్మోనీయులు దావీదునకు తమయందు అసహ్యము పుట్టించితిమని తెలిసికొనినప్పుడు హానూనును అమ్మోనీయులును అరామ్నహరయీము నుండియు, సిరియా మయకానుండియు సోబానుండియు రథములను గుఱ్ఱపురౌతులను రెండువేల మణుగుల వెండిఇచ్చి బాడిగెకు కుదుర్చుకొనిరి.

07 ముప్పది రెండువేల రథములతో వచ్చునట్లు జీతమిచ్చి మయకా రాజును అతని జనులను కుదుర్చుకొనిరి; వీరు వచ్చి మేదెబా ముందరితట్టున దిగిరి, అమ్మోనీయులు తమ తమ పట్టణములలోనుండి కూడుకొని యుద్దము చేయుటకు వచ్చిరి.

08 దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలుల నందరిని పంపెను.

09 అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవినియొద్ద యుద్ధపంక్తులు తీర్చిరి, వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి.

10 తాను రెండు సైన్యముల మధ్యను చిక్కుబడియుండుట చూచి, యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని, సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి,

11 కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరచి, తన సహోదరుడైన అబీషైకి అప్పగించి యిట్లనెను

12 సిరియనుల బలమునకు నేను నిలువలేక పోయినయెడల నీవు నాకు సహాయము చేయవలెను, అమ్మోనీయుల బలమునకు నీవు నిలువలేక పోయినయెడల నేను నీకు సహాయము చేయుదును.

13 ధైర్యము కలిగియుండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము; యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక.

14 ఆ ప్రకారము యోవాబును అతనితో కూడ నున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువలేక అతని యెదుటనుండి తిరిగి పారిపోయిరి.

15 సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషై ముందర నిలువలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి, యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను.

16 తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని సిరియనులు తెలిసికొనినప్పుడు వారు దూతలను పంపి, యేటి ఆవలి సిరియనులను పిలిపించుకొనిరి, హదరెజెరుయొక్క సైన్యాధిపతియైన షోపకు వారికి నాయకుడాయెను.

17 దావీదు ఆ సంగతి తెలిసికొని ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారియెదుట సైన్యములను వ్యూహపరచెను, దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి.

18 అయితే సిరియనులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువక తిరిగి పారిపోయిరి; దావీదు సిరియనులలో ఏడువేల రథికులను నలుబది వేల కాల్బలమును హతముచేసి సైన్యాధిపతియైన షోపకును చంపివేసెను.

19 తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని హదరెజెరుయొక్క సేవకులు తెలిసికొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటినుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సులేక యుండిరి.