Logo

ఎజ్రా అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

02 పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశముచేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.

03 కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడైయుండును గాక.

04 మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆ యా స్థలములలోనివారు తమయొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను.

05 అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితో కూడుకొని వచ్చి, యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి.

06 మరియు వారి చుట్టునున్న వారందరును స్వేచ్ఛగా అర్పించినవి గాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి.

07 మరియు నెబుకద్నెజరు యెరూషలేములోనుండి తీసికొనివచ్చి తన దేవతలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను.

08 పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్కచేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరుచేతికి అప్పగించెను.

09 వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమ్మిది కత్తులును

10 ముప్పది బంగారు గిన్నెలును నాలుగువందల పది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరి యితరమైన ఉపకరణములును వెయ్యియై యుండెను.

11 బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగువందలు. షేష్బజ్జరు బబులోను చరలోనుండి విడిపింపబడినవారితో కూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.