Logo

కీర్తనలు అధ్యాయము 7

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను నన్ను తరుమువారి చేతిలోనుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా

02 వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ నన్ను తప్పించుము.

03 యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసినయెడల

04 నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల

05 శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా.(సెలా.)

06 యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.

07 జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము.

08 యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతనుబట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము.

09 హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా,

10 దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగలవారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడైయున్నాడు.

11 న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.

12 ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచియున్నాడు

13 వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు

14 పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కనియున్నాడు.

15 వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను.

16 వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును.

17 యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.