Logo

కీర్తనలు అధ్యాయము 10

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు?

02 దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక

03 దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు

04 దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు

05 వారెల్లప్పడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరింతురు.

06 మేము కదల్చబడము, తరతరములవరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు

07 వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.

08 తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును.

09 గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడువారిని పట్టుకొన పొంచియుందురు బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు.

10 కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారమువలన నిరాధారులు కూలుదురు.

11 దేవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు.

12 యెహోవా లెమ్ము, దేవా బాధపడువారిని మరువక నీ చెయ్యి యెత్తుము

13 దుష్టులు దేవుని తృణీకరించుట యేల? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట యేల?

14 నీవు దీనిని చూచియున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు

15 దుష్టుల భుజమును విరుగగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవువరకు దానినిగూర్చి విచారణ చేయుము.

16 యెహోవా నిరంతరము రాజైయున్నాడు ఆయన దేశములోనుండి అన్యజనులు నశించిపోయిరి.

17 యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడువారి కోరికను నీవు వినియున్నావు

18 తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి.