Logo

ఆదికాండము అధ్యాయము 19

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి

02 నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి

03 అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతనితట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.

04 వారు పండుకొనకముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి

05 లోతును పిలిచి ఈ రాత్రి నీయొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మాయొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా

06 లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపువేసి

07 అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి;

08 ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.

09 ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి తీర్పరిగానుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి.

10 అయితే ఆ మనుష్యులు తమచేతులు చాపి లోతును ఇంటిలోపలికి తమయొద్దకు తీసికొని తలుపు వేసిరి.

11 అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దలవరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి.

12 అప్పుడా మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరియెవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొనిరమ్ము;

13 మేము ఈ చోటు నాశనము చేయవచ్చితివిు; వారినిగూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా

14 లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.

15 తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము; ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి.

16 అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుటవలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెలచేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి

17 ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా

18 లోతు ప్రభువా ఆలాగు కాదు.

19 ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షించుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి; నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో

20 ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా, నేను బ్రదుకుదునని చెప్పినప్పుడు

21 ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని;

22 నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము; నీవక్కడ చేరువరకు నేనేమియు చేయలేననెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను.

23 లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను.

24 అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్దనుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి

25 ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేలమొలకలను నాశనము చేసెను.

26 అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పుస్థంభమాయెను.

27 తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి

28 సొదొమ గొమొఱ్ఱాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలె లేచుచుండెను.

29 దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను.

30 లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.

31 అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు; సర్వలోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.

32 మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను.

33 ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.

34 మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.

35 ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.

36 ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.

37 వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.

38 చిన్నదికూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.