Logo

సామెతలు అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు.

02 జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును

03 నీతి న్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును

04 జ్ఞానము లేనివారికి బుద్ధి కలిగించుటకును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.

05 జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసికొనును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.

06 వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు.

07 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

08 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.

09 అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును

10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.

11 మాతోకూడ రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము

12 పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.

13 పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము

14 నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు.

15 నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.

16 కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.

17 పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము.

18 వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు.

19 ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును.

20 జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది

21 గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది

22 ఎట్లనగా, జ్ఞానము లేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించుకొందురు?

23 నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను.

24 నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయి చాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి

25 నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసివేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.

26 కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను

27 భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.

28 అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును.

29 జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారికిష్టము లేకపోయెను.

30 నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.

31 కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు

32 జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు.

33 నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.