Logo

యెషయా అధ్యాయము 63

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యితడెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.

02 నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్నవేమి?

03 ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే.

04 పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను

05 నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను.

06 కోపముగలిగి జనములను త్రొక్కివేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.

07 యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమునుబట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.

08 వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.

09 వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

10 అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను.

11 అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములోనుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి?

12 తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి?

13 తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించినవాడేడి? యనుకొనిరి

14 పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి

15 పరమునుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసస్థలమునుండి దృష్టించుము నీ ఆసక్తి యేది? నీ శౌర్యకార్యములేవి? నాయెడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగిపోయెనే.

16 మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగకపోయినను ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా, నీవే మాతండ్రివి అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే గదా.

17 యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగిరమ్ము.

18 నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు.

19 నీ పరిపాలన నెన్నడును ఎరుగనివారివలె నైతివిు నీ పేరెన్నడును పెట్టబడనివారివలె నైతివిు.