Logo

విలాపవాక్యములు అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశమునుండి భూమిమీదికి పడవేసెను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసికొనకపోయెను.

02 ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాసస్థలములన్నిటిని నాశనము చేసియున్నాడు మహోగ్రుడై యూదాకుమార్తె కోటలను పడగొట్టియున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని యధిపతులను ఆయన అపవిత్రపరచియున్నాడు.

03 కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టియున్నాడు శత్రువులుండగా తన కుడిచెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు.

04 శత్రువువలె ఆయన విల్లెక్కుపెట్టి విరోధివలె కుడిచెయ్యి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనము చేసియున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారములమీద కుమ్మరించియున్నాడు.

05 ప్రభువు శత్రువాయెను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటిని నాశనము చేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యూదాకుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు.

06 ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడు తన సమాజస్థలమును నాశనము చేసియున్నాడు యెహోవా సీయోనులో నియామకకాలము విశ్రాంతిదినము మరువబడునట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసియున్నాడు.

07 ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధస్థలమునందు అసహ్యించుకొనెను దానినగరుల ప్రాకారములను శత్రువులచేతికి అప్పగించెను వారు నియామకకాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి.

08 సీయోను కుమారియొక్క ప్రాకారములను పాడుచేయుటకు యెహోవా ఉద్దేశించెను నాశనము చేయుటకు తన చెయ్యి వెనుకతీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీనిగూర్చి మూల్గుచున్నవి అవి యేకరీతిగా క్షీణించుచున్నవి.

09 పట్టణపు గవునులు భూమిలోనికి క్రుంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడుచేసెను దాని రాజును అధికారులును అన్యజనులలోనికి పోయియున్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు.

10 సీయోనుకుమారి పెద్దలు మౌనులై నేలకూర్చుందురు తలలమీద బుగ్గిపోసికొందురు గోనెపట్ట కట్టుకొందురు యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచుకొందురు.

11 నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది. శిశువులును చంటిబిడ్డలును పట్టణపువీధులలో మూర్ఛిల్లెదరు.

12 గాయమొందినవారై పట్టణపువీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మునానుకొని అన్నము ద్రాక్షారసము ఏదియని తమ తల్లులనడుగుచు ప్రాణము విడిచెదరు.

13 యెరూషలేముకుమారీ, ఎట్టిమాటలచేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటిచేయుదును? సీయోనుకుమారీ, కన్యకా, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు?

14 నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థదర్శనములు చూచియున్నారు నీవు చెరలోనికిపోకుండ తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడిచేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవతప్పించు దర్శనములు చూచినవారైరి.

15 త్రోవను వెళ్లువారందరు నిన్నుచూచి చప్పట్లుకొట్టెదరు వారు యెరూషలేముకుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమునుగూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు

16 నీ శత్రువులందరు నిన్నుచూచి నోరుతెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లుకొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.

17 యెహోవా తాను యోచించిన కార్యము ముగించియున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు శేషములేకుండ నిన్ను పాడుచేసియున్నాడు నిన్నుబట్టి శత్రువులు సంతోషించునట్లు చేసియున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు.

18 జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొఱ్ఱపెట్టుదురు. సీయోనుకుమారి ప్రాకారమా, నదీప్రవాహమువలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనియ్యకుము నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము.

19 నీవులేచి రేయి మొదటిజామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీచేతులను ఆయనతట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు

20 నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించిచూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగువా?

21 యౌవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు నా కన్యకలును నా యౌవనులును ఖడ్గముచేత కూలియున్నారు నీ ఉగ్రతదినమున నీవు వారిని హతముచేసితివి దయతలచక వారినందరిని వధించితివి.

22 ఉత్సవదినమున జనులు వచ్చునట్లుగా నలుదిశలనుండి నీవు నామీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రతదినమున ఎవడును తప్పించుకొనలేకపోయెను శేషమేమియు నిలువకపోయెను నేనుచేతులలో ఆడించి సాకినవారిని శత్రువులు హరించివేసియున్నారు.