Logo

ఆమోసు అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యూదారాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను, భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములు ముందు, ఇశ్రాయేలీయులనుగూర్చి తెకోవలోని పసుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము.

02 అతడు ప్రకటించినదేమనగా యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవుచున్నది.

03 యెహోవా సెలవిచ్చునదేమనగా దమస్కు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.

04 నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను; అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును;

05 దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలముచేతును, బెతేదేనులో ఉండకుండ రాజదండము వహించిన వానిని నిర్మూలముచేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

06 యెహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలెనని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి.

07 గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;

08 అష్డోదులో నివాసులను నిర్మూలముచేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

09 యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరిని ఎదోమీయులకు అప్పగించిరి.

10 నేను తూరు ప్రాకారములమీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును.

11 యెహోవా సెలవిచ్చునదేమనగా ఎదోము మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగు వారిని మానక చీల్చుచువచ్చెను.

12 తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రా యొక్క నగరులను దహించివేయును.

13 యెహోవా సెలవిచ్చునదేమనగా అమ్మోనీయులు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి, గిలాదులోని గర్భిణి స్త్రీల కడుపులను చీల్చిరి.

14 రబ్బా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని రాజబెట్టుదును; రణకేకలతోను, సుడిగాలి వీచునప్పుడు కలుగు ప్రళయమువలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును.

15 వారి రాజును అతని అధిపతులును అందరును చెరలోనికి కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.