Logo

హగ్గయి అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఏడవ నెల యిరువది యొకటవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

02 నీవు యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనుము

03 పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది గదా.

04 అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

05 మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీమధ్యన ఉన్నది గనుక భయపడకుడి.

06 మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.

07 నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరి యొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

08 వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

09 ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

10 మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవ నెల యిరువది నాల్గవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

11 సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు యాజకులయొద్ద ధర్మశాస్త్ర విచారణచేయుము.

12 ఒకడు ప్రతిష్టితమైన మాంసమును తన వస్త్రపుచెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి

13 శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునా యని హగ్గయి మరలనడుగగా యాజకులు అది అపవిత్రమగుననిరి.

14 అప్పుడు హగ్గయి వారి కీలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఈ ప్రజలును ఈ జనులును నా దృష్టికి ఆలాగుననే యున్నారు; వారు చేయు క్రియలన్నియు వారచ్చట అర్పించునవి యన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.

15 ఈ రాతి మీద రాయియుంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించినదానిని ఆలోచనచేసికొనుడి.

16 నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుచున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమే దొరకును.

17 తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకు రాలేదు; ఇదే యెహోవా వాక్కు.

18 మీరు ఆలోచించుకొనుడి. ఇంతకుముందుగా తొమ్మిదవ నెల యిరువది నాలుగవ దినమునుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటనుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి.

19 కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను అంజూరపుచెట్లయినను దానిమ్మచెట్లయినను ఒలీవచెట్లయినను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.

20 మరియు ఆ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

21 యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.

22 రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనముచేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.

23 నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవునైన జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగాచేతును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.