Logo

లేవీయకాండము అధ్యాయము 20

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

02 ఇశ్రాయేలీయులలోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని యొకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను.

03 ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.

04 మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశప్రజలు వాని చంపక,

05 చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొనినయెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారముచేయు వారినందరిని ప్రజలలోనుండి కొట్టివేతును.

06 మరియు కర్ణపిశాచి గలవారితోను సోదెగాండ్రతోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.

07 కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహోవాను.

08 మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను

09 ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.

10 పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.

11 తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.

12 ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.

13 ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించినయెడల వారిద్దరు హేయక్రియను చేసిరిగనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.

14 ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసికొనినయెడల అది దుష్కామప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్య నుండకుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.

15 జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.

16 స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమ శిక్షకు తామే కారకులు.

17 ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనేగాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచినయెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానాచ్ఛాదనమును తీసెను; తన దోషశిక్షను తాను భరించును.

18 కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్తధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజలలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.

19 నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్తసంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.

20 పినతల్లితోనే గాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.

21 ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.

22 కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.

23 నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములనుబట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్యపడితిని.

24 నేను మీతో చెప్పిన మాట యిదే మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.

25 కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన యే జంతువువలననేగాని, యే పక్షివలననేగాని, నేల మీద ప్రాకు దేనివలననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.

26 మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారైయుండునట్లు అన్యజనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.

27 పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణశిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.