Logo

లేవీయకాండము అధ్యాయము 25

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను

02 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమికూడ యెహోవా పేరట విశ్రాంతికాలమును, ఆచరింపవలెను.

03 ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షములతోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును.

04 ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతికాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్ధిపరచకూడదు.

05 నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు; అది భూమికి విశ్రాంతి సంవత్సరము.

06 అప్పుడు భూమియొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును.

07 మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును.

08 మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను, అనగా ఏడేసి యేండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ యేడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలుబది తొమ్మిది సంవత్సరములగును.

09 ఏడవ నెల పదియవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను.

10 మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగిరావలెను.

11 ఆ సంవత్సరము, అనగా ఏబదియవ సంవత్సరము మీకు సునాదకాలము. అందులో మీరు విత్తకూడదు కారుపంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు.

12 అది సునాద కాలము; అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు.

13 ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను.

14 నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములోకాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు.

15 సునాద సంవత్సరమైన తరువాత గడచిన యేండ్ల లెక్కచొప్పున నీ పొరుగువానియొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను.

16 ఆ సంవత్సరముల లెక్క హెచ్చినకొలది దాని వెల హెచ్చింపవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గినకొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్కచొప్పున అతడు దాని నీకు అమ్మును గదా.

17 మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.

18 కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిననుసరించి నడుచుకొనవలెను.

19 అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు.

20 ఏడవ యేట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకొందురేమో.

21 అయితే నేను ఆరవయేట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను; అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును.

22 మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరమువరకు పాతపంట తినెదరు; దాని పంటను కూర్చువరకు పాతదానిని తినెదరు.

23 భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు.

24 మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడునట్లుగా దాని అమ్ముకొనవలెను.

25 నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినయెడల తన సహోదరుడు అమ్మినదానిని అతడు విడిపించును.

26 అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించినయెడల

27 దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరములు లెక్కించి యెవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును.

28 అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకనియెడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరమువరకు కొనినవాని వశములో ఉండవలెను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును; అప్పుడతడు తన స్వాస్థ్యమును మరల నొందును.

29 ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమ్మినయెడల దాని అమ్మినదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సరదినములోనే దాని విడిపించుకొనవచ్చును.

30 అయితే ఆ సంవత్సరదినములు నిండకమునుపు దాని విడిపింపనియెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లు కొనినవానికి వాని తర తరములకు అది స్థిరముగానుండును. అది సునాద కాలమున తొలగిపోదు.

31 చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాదకాలములో తొలగిపోవును.

32 అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును.

33 లేవీయుల పట్టణముల యిండ్లు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయులయొద్ద ఇల్లు సంపాదించినయెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును.

34 వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.

35 పరవాసియైనను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీవలన బ్రదుకవలెను.

36 నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసికొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.

37 నీ రూకలు వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు.

38 నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.

39 నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొనకూడదు.

40 వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాద సంవత్సరమువరకు నీయొద్ద దాసుడుగా ఉండవలెను.

41 అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీయొద్దనుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను.

42 ఏలయనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు;

43 నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము.

44 మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును.

45 మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టినవారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు.

46 మీ తరువాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకనిచేత ఒకడు కఠినసేవ చేయించుకొనకూడదు.

47 పరదేశియేగాని నీయొద్ద నివసించువాడేగాని ధనసంపాదనము చేసికొనునప్పుడు అతనియొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీయొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకొనినయెడల

48 తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును.

49 వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమారుడేగాని వాని వంశములో వాని రక్తసంబంధియేగాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికినయెడల తన్ను తాను విడిపించుకొనవచ్చును.

50 అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరమువరకు తన్ను కొనినవానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలెను. తాను జీతగాడైయుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను.

51 ఇంక అనేక సంవత్సరములు మిగిలియుండినయెడల వాటినిబట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరల ఇయ్యవలెను.

52 సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైనయెడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను.

53 ఏటేటికి జీతగానివలె వాడతనియొద్ద ఉండవలెను. అతడు మీ కన్నులయెదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు.

54 అతడు ఈ రీతిగా విడిపింపబడనియెడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడ విడుదలనొందును.

55 ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు; నేను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను.