Logo

మత్తయి అధ్యాయము 26

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి

02 రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను.

03 ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి

04 యేసును మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచన చేసిరి.

05 అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి.

06 యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు,

07 ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను.

08 శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు?

09 దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అనిరి.

10 యేసు ఆ సంగతి తెలిసికొని ఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు?

11 బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతోకూడ ఉండను.

12 ఈమె యీ అత్తరు నా శరీరముమీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను.

13 సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

14 అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి

15 నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.

16 వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను.

17 పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి.

18 అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి నా కాలము సమీపమైయున్నది; నా శిష్యులతో కూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను

19 యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి.

20 సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుండెను.

21 వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

22 అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా, నేనా? అని ఆయననడుగగా

23 ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యి ముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.

24 మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.

25 ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను.

26 వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.

27 మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి.

28 ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.

29 నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.

30 అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి.

31 అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా గొఱ్ఱల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱలు చెదరిపోవును అని వ్రాయబడియున్నది గదా.

32 నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెదననెను.

33 అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా

34 యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

35 పేతురాయనను చూచి నేను నీతోకూడ చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను; అదే ప్రకారము శిష్యులందరు అనిరి.

36 అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి

37 పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను.

38 అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి

39 కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగిపోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

40 ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక గడియయైనను నాతోకూడ మేల్కొని యుండలేరా?

41 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి

42 మరల రెండవమారు వెళ్లి నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధ్యము కానియెడల, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి

43 తిరిగివచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను.

44 ఆయన వారిని మరల విడిచివెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను.

45 అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి; ఇదిగో ఆ గడియ వచ్చియున్నది; మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు;

46 లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను.

47 ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధానయాజకులయొద్ద నుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను.

48 ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి

49 వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.

50 యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి.

51 ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను.

52 యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.

53 ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనావ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?

54 నేను వేడుకొనినయెడల ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.

55 ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు.

56 అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.

57 యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయపయొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి.

58 పేతురు ప్రధానయాజకుని యింటి ముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలెనని బంట్రౌతులతోకూడ కూర్చుండెను.

59 ప్రధానయాజకులును, మహా సభ వారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని

60 అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.

61 తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి.

62 ప్రధానయాజకుడు లేచి నీవు ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను.

63 అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు నీవన్నట్టే.

64 ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా

65 ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని--వీడు దేవదూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు;

66 మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి.

67 అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;

68 కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి.

69 పేతురు వెలుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చి నీవును గలిలయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను.

70 అందుకతడు నేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరియెదుట అనెను.

71 అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరియొక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా

72 అతడు ఒట్టుపెట్టుకొని నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.

73 కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.

74 అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను

75 కనుక కోడి కూయకమునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి యేడ్చెను.