Logo

1కొరిందీయులకు అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును

02 కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

03 మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగును గాక.

04 క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

05 క్రీస్తునుగూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,

06 అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి;

07 గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.

08 మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును.

09 మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

10 సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

11 నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారివలన నాకు తెలియవచ్చెను.

12 మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.

13 క్రీస్తు విభజింపబడియున్నాడా? పౌలు మీకొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?

14 నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు,

15 క్రిస్పునకును గాయియుకును తప్ప మరియెవరికిని నేను బాప్తిస్మమియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

16 స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను.

17 బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.

18 సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

19 ఇందువిషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.

20 జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?

21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెఱ్ఱితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను.

22 యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు.

23 అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.

24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

25 దేవుని వెఱ్ఱితనము మనుష్య జ్ఞానముకంటె జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.

26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని

27 ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

28 జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

29 ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింపబడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

30 అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు.

31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.