Logo

గలతీయులకు అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడ యెరూషలేమునకు తిరిగి వెళ్లితిని.

02 దేవదర్శన ప్రకారమే వెళ్లితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో, లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని.

03 అయినను నాతోకూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతపెట్టబడలేదు.

04 మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తుయేసువలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులవలన జరిగినది.

05 సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు.

06 ఎన్నికైనవారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరుని వేషము చూడడు. ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు.

07 అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నా కప్పగింపబడెనని వారు చూచినప్పుడు,

08 అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,

09 స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.

10 మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని.

11 అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;

12 ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందినవారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను.

13 తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోసపోయెను.

14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవైయుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?

15 మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక క్రీస్తునందలి విశ్వాసమువలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము;

16 ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.

17 కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు.

18 నేను పడగొట్టిన వాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా.

19 నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని.

20 నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.

21 నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే.