Logo

ఎఫెసీయులకు అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

02 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

03 ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

04 శరీరమొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడితిరి.

05 ప్రభువు ఒక్కడే, విశ్వాసమొక్కటే, బాప్తిస్మమొక్కటే,

06 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.

07 అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప యియ్యబడెను.

08 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.

09 ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చుచున్నది గదా.

10 దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునైయున్నాడు.

11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వముపొంది సంపూర్ణ పురుషులమగువరకు,

12 అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

14 అందువలన మనమికమీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక

15 ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

16 ఆయన శిరస్సయియున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.

17 కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.

18 వారైతే అంధకారమైన మనస్సు గలవారై, తమ హృదయకాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

19 వారు సిగ్గులేనివారై యుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.

20 అయితే మీరు యేసునుగూర్చి విని,

21 ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారు కారు.

22 కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని

23 మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,

24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.

25 మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.

26 కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచి యుండకూడదు.

27 అపవాదికి చోటియ్యకుడి;

28 దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తనచేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.

29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష యేదైనను మీనోట రానియ్యకుడి.

30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినము వరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.

31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.

32 ఒకనియెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.