Logo

సంఖ్యాకాండము అధ్యాయము 18

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా అహరోనుతో ఇట్లనెను నీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధస్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు; నీవును నీ కుమారులును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు

02 మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొనిరావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెను

03 వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠమునొద్దకైనను సమీపింపవలదు.

04 వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవవిషయములో దాని కాపాడవలెను.

05 అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడవలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు.

06 ఇదిగో నేను ఇశ్రాయేలీయులమధ్యనుండి లేవీయులైన మీ సహోదరులను తీసికొనియున్నాను; ప్రత్యక్షపు గుడారముయొక్క సేవచేయుటకు వారు యెహోవావలన మీకప్పగింపబడియున్నారు.

07 కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెర లోపలిదాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును.

08 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతిష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను; అభిషేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను.

09 అగ్నిలో దహింపబడని అతిపరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్నిటిలోను, వారి అపరాధపరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగిచెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరిశుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను.

10 ప్రతి మగవాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును.

11 మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటినిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును.

12 వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని.

13 వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవియగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తినవచ్చును.

14 ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును.

15 మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను.

16 అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణమునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు.

17 అయితే ఆవుయొక్క తొలిచూలిని గొఱ్ఱయొక్క తొలిచూలిని మేకయొక్క తొలిచూలిని విడిపింపకూడదు; అవి ప్రతిష్ఠితమైనవి; వాటి రక్తమును నీవు బలిపీఠముమీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను గాని వాటి మాంసము నీదగును.

18 అల్లాండిపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అదియు నీదగును.

19 ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన.

20 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారి మధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.

21 ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని.

22 ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇకమీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు.

23 అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై యుందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమియు ఉండదు. ఇది మీ తర తరములకు నిత్యమైన కట్టడ.

24 అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని.

25 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

26 నీవు లేవీయులతో ఇట్లనుము నేను ఇశ్రాయేలీయులచేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను.

27 మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షలతొట్టి ఫలమువలెను ఎంచవలెను.

28 అట్లు మీరు ఇశ్రాయేలీయులయొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలోనుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలోనుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను.

29 మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలోనుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలోనుండి ప్రతిష్ఠింపవలెను.

30 మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపు వచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను.

31 మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము.

32 మీరు దానిలోనుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాపశిక్షను భరింపకుందురు; మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైనవాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.