Logo

హెబ్రీయులకు అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.

02 వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్‌ప్రయోజనమైనదాయెను.

03 కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తియై యున్నను ఈ విశ్రాంతినిగూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము.

04 మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పియున్నాడు.

05 ఇదియును గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు.

06 కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినినవారు అవిధేయతచేత ప్రవేశింపలేదు గనుకను,

07 నేడు మీరాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు.

08 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును.

09 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.

10 ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.

11 కాబట్టి అవిధేయతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్తపడుదము.

12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.

13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసి యున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.

14 ఆకాశమండలము గుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.

15 మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము.