Logo

హెబ్రీయులకు అధ్యాయము 13

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి

02 ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి.

03 మీరును వారితో కూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.

04 వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

05 ధనాపేక్ష లేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.

06 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.

07 మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.

08 యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.

09 నానావిధములైన అన్యబోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనములనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగలేదు.

10 మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవ చేయువారికి అధికారములేదు.

11 వేటి రక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.

12 కావున యేసు కూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.

13 కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్లుదము.

14 నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచుచున్నాము.

15 కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.

17 మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.

18 మా నిమిత్తము ప్రార్థన చేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాను.

19 మరియు నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి యెక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

20 గొఱ్ఱల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,

21 యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

22 సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను.

23 మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితో కూడ వచ్చి మిమ్మును చూచెదను.

24 మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు.

25 కృప మీ అందరికి తోడైయుండును గాక ఆమెన్