Logo

1సమూయేలు అధ్యాయము 20

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 పిమ్మట దావీదు రామాలోని నాయోతునుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి నేను ఏమి చేసితిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని యడుగగా

02 యోనాతాను ఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు; నాకు తెలియజేయకుండ నా తండ్రి చిన్నకార్యమే గాని పెద్దకార్యమేగాని చేయడు; నా తండ్రి ఇదెందుకు నాకు మరుగుచేయుననగా

03 దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలిసికొని, యోనాతానునకు చింత కలుగకుండుటకై యిది అతనికి తెలుపననుకొనుచున్నాడు; అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా

04 యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీయెడల జరుపుదుననెను.

05 అందుకు దావీదు రేపటిదినము అమావాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.

06 ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటివారికి ఏటేట బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నాయొద్ద సెలవుపుచ్చుకొనెను.

07 అతడు మంచిదని సెలవిచ్చినయెడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును; అతడు బహుగా కోపించినయెడల అతడు నాకు కీడుచేయ తాత్పర్యము గలవాడైయున్నాడని నీవు తెలిసికొని

08 నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను; ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి; నాయందు దోషమేమైన ఉండినయెడల నీ తండ్రియొద్దకు నన్నెందుకు తోడుకొనిపోదువు? నీవే నన్ను చంపుమని యోనాతానునొద్ద మనవి చేయగా

09 యోనాతాను ఆ మాట ఎన్నటికిని అనరాదు; నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశము గలిగియున్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును గదా అని అనగా

10 దావీదు నీ తండ్రి నన్నుగూర్చి నీతో కఠినముగా మాటలాడినయెడల దాని నాకు తెలియజేయువారెవరని యోనాతాను నడిగెను.

11 అందుకు యోనాతాను పొలములోనికి వెళ్లుదము రమ్మనగా, ఇద్దరును పొలములోనికి పోయిరి.

12 అప్పుడు యోనాతాను ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి; రేపైనను ఎల్లుండియైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును; అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలిసికొనినయెడల నేను ఆ వర్తమానము నీకు పంపకపోవుదునా?

13 అయితే నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయు గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండును గాక.

14 అయితే నేను బ్రదికియుండినయెడల నేను చావకుండ యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక పోయినయెడల నేమి,

15 నేను చనిపోయినయెడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమిమీద నిలువకుండ నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతివారికి దయచూపక పోయినయెడల నేమి యెహోవా నిన్ను విసర్జించును గాక.

16 ఈలాగున యెహోవా దావీదుయొక్క శత్రువులచేత దాని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతివారిని బట్టి నిబంధన చేసెను.

17 యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమనుబట్టి దావీదుచేత మరల ప్రమాణము చేయించెను.

18 మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను రేపటిదినము అమావాస్య; నీ స్థలము ఖాళిగా కనబడును గదా;

19 నీవు మూడు దినములు ఆగి, యీ పని జరుగుచుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్లి ఏసెలు అనుబండ దగ్గర నుండుము

20 గురి చూచి ప్రయోగించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి

21 నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదును బాణములు నీకు ఈ తట్టున నున్నవి, పట్టుకొనిరమ్మని నేను వానితో చెప్పినయెడల నీవు బయటికి రావచ్చును; యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును.

22 అయితే బాణములు నీకు అవతల నున్నవని నేను వానితో చెప్పినయెడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెను.

23 అయితే మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము; నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి.

24 కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను; అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా

25 మునుపటివలెనే రాజు గోడదగ్గర నున్న స్థలమందు తన ఆసనముమీద కూర్చునియుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను; అయితే దావీదు స్థలము ఖాళిగా నుండెను.

26 అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై యుండునేమో, అతడు అపవిత్రుడై యుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియు అనలేదు.

27 అయితే అమావాస్య పోయిన మరునాడు, అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవుట చూచి సౌలు నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను నడుగగా

28 యోనాతాను దావీదు బేత్లెహేమునకు పోవలెనని కోరి

29 దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా యింటివారు బలి అర్పింపబోవుచున్నారు నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయపొందిన వాడనైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించునట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నాయొద్ద సెలవు తీసికొనెను; అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్లయొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా

30 సౌలు యోనాతానుమీద బహుగా కోపపడి ఆగడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా?

31 యెష్షయి కుమారుడు భూమిమీద బ్రదుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా; కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకర్హుడని చెప్పెను.

32 అంతట యోనాతాను అతడెందుకు మరణ శిక్ష నొందవలెను? అతడు ఏమి చేసెనని సౌలు నడుగగా

33 సౌలు అతనిని పొడువవలెనని యీటె విసిరెను; అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము గలిగియున్నాడని యోనాతాను తెలిసికొని

34 అత్యాగ్రహుడై బల్లయొద్దనుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను.

35 ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసికొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను.

36 నీవు పరుగెత్తికొనిపోయి నేను వేయు బాణములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను.

37 అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుకనుండి కేక వేసి బాణము నీ అవతలనున్నదని చెప్పి

38 వాని వెనుకనుండి కేకవేసి నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను; యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసికొనివచ్చెను గాని

39 సంగతి ఏమియు వానికి తెలియక యుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసియుండెను.

40 యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసికొనిపొమ్మని చెప్పి వాని పంపివేసెను.

41 వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.

42 అంతట యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసికొని యున్నాము గనుక మనస్సులో నెమ్మది గలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్లిపోయెను; యోనాతానును పట్టణమునకు తిరిగివచ్చెను.