Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 19

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యూదారాజైన యెహోషాపాతు ఏ యపాయమును చెందకుండ యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగిరాగా

02 దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటన చేసెను నీవు భక్తిహీనులకు సహాయముచేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా? అందువలన యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును.

03 అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.

04 యెహోషాపాతు యెరూషలేములో నివాసముచేయుచు బేయేర్షెబానుండి ఎఫ్రాయిము మన్యమువరకు జనులమధ్యను సంచరించుచు, వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను.

05 మరియు అతడు ఆ యా పట్టణములలో, అనగా దేశమందు యూదావారున్న బురుజులుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికీలాగున ఆజ్ఞాపించెను

06 మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుష్యుల నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతో కూడ నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి.

07 యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు,ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.

08 మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును, సందేహాంశములను పరిష్కరించుటకును, యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల యిండ్ల పెద్దలలోను కొందరిని నియమించి

09 వారికీలాగున ఆజ్ఞాపించెను యెహోవాయందు భయభక్తులు కలిగినవారై, నమ్మకముతోను యథార్థ మనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను.

10 నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయవిధులను గూర్చియు,ఆ యా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమర్శించునప్పుడు, మీమీదికిని మీ సహోదరులమీదికిని కోపము రాకుండునట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండ వారిని హెచ్చరిక చేయవలెను; మీరాలాగు చేసినయెడల అపరాధులు కాకయుందురు.

11 మరియు ప్రధానయాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు, యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతో కూడ ఉండును.