Logo

యెషయా అధ్యాయము 23

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడిచేయబడెను.

02 సముద్రతీరవాసులారా, అంగలార్చుడి సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరకులతో నిన్ను నింపిరి.

03 షీహోరు నది ధాన్యము నైలునది పంట సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను తూరువలన జనములకు లాభము వచ్చెను.

04 సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవవేదన పడనిదానను పిల్లలు కననిదానను యౌవనస్థులను పోషింపనిదానను కన్యకలను పెంచనిదానను.

05 ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరునుగూర్చి మిక్కిలి దుఃఖింతురు.

06 తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగలార్చుడి.

07 నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలముననుండిన పట్టణమిదేనా? పరదేశ నివాసము చేయుటకు దూరప్రయాణము చేసినదిదేనా?

08 దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయనెవడు ఉద్దేశించెను?

09 సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయ నుద్దేశించెను.

10 తర్షీషు కుమారీ, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను నైలునది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము.

11 ఆయన సముద్రముమీద తన చెయ్యి చాపెను రాజ్యములను కంపింపజేసెను కనాను కోటలను నశింపజేయుటకు యెహోవా దానిగూర్చి ఆజ్ఞాపించెను.

12 మరియు ఆయన సీదోను కన్యకా, చెరపబడినదానా, నీకికను సంతోషముండదు నీవు లేచి కిత్తీముకు దాటిపొమ్ము అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు

13 ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జనముగా ఉండరు అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు.

14 తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను.

15 ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరవబడును డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును, ఏమనగా

16 మరవబడిన వేశ్యా, సితారా తీసికొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయించుము అనేక కీర్తనలు పాడుము.

17 డెబ్బది సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును అది వేశ్యజీతమునకు మరల భూమిమీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును.

18 వేశ్య జీతముగా ఉన్నదాని వర్తకలాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.