యోహాను
అధ్యాయం 6
అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.
రోగులయెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.
యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.
అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.
కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పునడిగెను గాని
యేమి చేయనైయుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.
అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.
ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ
ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా
యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.
యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంతమట్టుకు వడ్డించెను;
వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.
కాబట్టి వారు భుజించిన తరువాత వారియొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.
ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.
సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపుటద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.
అంతలో చీకటాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.
అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.
వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;
అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.
కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.
మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చిచూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదుగాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.
అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.
కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.
సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా
యేసు మీరు సూచనలను చూచుటవలన కాదుగాని రొట్టెలు భుజించి తృప్తిపొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.
వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా
యేసు ఆయన పంపినవానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.
వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?
భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.
కాబట్టి యేసు పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు.
పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమునిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమైయున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.
కావున వారు ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి.
అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,
నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.
మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని.
తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను.
నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని.
ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.
కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.
కాబట్టి నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?
ఈయన తలిదండ్రులను మనమెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగివచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.
అందుకు యేసు మీలో మీరు సణుగుకొనకుడి;
నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నాయొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.
వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.
దేవునియొద్దనుండి వచ్చినవాడు తప్ప మరియెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు.
విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే.
మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.
దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే.
పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.
కావున యేసు ఇట్లనెను మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.
నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునైయున్నది.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.
జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.
ఇదే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను
ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.
ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.
యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?
ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్నచోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?
ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని
మీలో విశ్వసించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును.
మరియు ఆయన తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను.
అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.
కాబట్టి యేసు మీరుకూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా
సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;
నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.
అందుకు యేసు నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను.
సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండుమందిలో ఒకడైయుండి ఆయననప్పగింపబోవుచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.