Logo

నెహెమ్యా అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా

02 నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులనుగూర్చియు, యెరూషలేమునుగూర్చియు నేను వారినడుగగా

03 వారు చెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు; మరియు యెరూషలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి.

04 ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.

05 ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,

06 నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగ పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి యింటివారును పాపము చేసియున్నాము.

07 నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివిు, నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతివిు.

08 నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము; అదేదనగా మీరు అపరాధము చేసినయెడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును.

09 అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినయెడల, భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడనుండి సహా మిమ్మును కూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా.

10 చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావమును చూపి, నీ బాహుబలముచేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే.

11 యెహోవా చెవి యొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.