Logo

ఎస్తేరు అధ్యాయము 7

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 రాజును హామానును రాణియైన ఎస్తేరునొద్దకు విందునకు రాగా

02 రాజు ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన మేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? రాజ్యములో సగముమట్టుకైనను నీకనుగ్రహించెదనని రెండవనాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను.

03 అప్పుడు రాణియైన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాజా, నీ దృష్టికి నేను దయపొందినదాననైనయెడల రాజవైన తమకు సమ్మతియైతే, నా విజ్ఞాపననుబట్టి నా ప్రాణమును, నా మనవినిబట్టి నా జనులును, నా కనుగ్రహింపబడుదురు గాక.

04 సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులును కూడ అమ్మబడినవారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడినయెడల నేను మౌనముగా నుందును; ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తముకాదు.

05 అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు ధృఢపరచుకొన్నవాడెవడు? వాడేడి? అని రాణియగు ఎస్తేరు నడుగగా

06 ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి యెదుటను భయాక్రాంతుడాయెను.

07 రాజు ఆగ్రహమొంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హానిచేయ నుద్దేశించెనని హామాను తెలిసికొని, రాణియైన ఎస్తేరు ఎదుట తన ప్రాణముకొరకు విన్నపము చేయుటకై నిలిచెను.

08 నగరువనములోనుండి ద్రాక్షారసపు విందుస్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్యమీద హామాను బడియుండుట చూచి వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుకు వేసిరి.

09 రాజుముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తుగల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడి యున్నదనగా రాజు దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.

10 కాగా హామాను మొర్దెకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను.