Logo

ప్రసంగి అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై యుండిన ప్రసంగి పలికిన మాటలు.

02 వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే.

03 సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభమేమి?

04 తరము వెంబడి తరము గతించిపోవుచున్నది; భూమి యొకటే యెల్లప్పుడును నిలుచునది.

05 సూర్యుడుదయించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును.

06 గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.

07 నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును

08 ఎడతెరిపిలేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింపజాలరు; చూచుటచేత కన్ను తృప్తి పొందకున్నది, వినుటచేత చెవికి తృప్తి కలుగుటలేదు.

09 మునుపు ఉండినదే ఇక ఉండబోవునది; మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు.

10 ఇది నూతనమైనదని యొకదానిగూర్చి యొకడు చెప్పును; అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే.

11 పూర్వులు జ్ఞాపకమునకు రారు; పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవువారికి కలుగదు.

12 ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులమీద రాజునై యుంటిని.

13 ఆకాశముక్రింద జరుగునది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది.

14 సూర్యునిక్రింద జరుగుచున్న క్రియలనన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి.

15 వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు, లోపము గలది లెక్కకు రాదు.

16 యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటెను నేను చాల ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనస్సులో నేననుకొంటిని.

17 నా మనస్సు నిలిపి, జ్ఞానాభ్యాసమును వెఱ్ఱితనమును మతిహీనతను తెలిసికొనుటకు ప్రయత్నించితిని; అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలిసికొంటిని.

18 విస్తారమైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును; అధిక విద్య సంపాదించినవానికి అధిక శోకము కలుగును.