Logo

పరమగీతము అధ్యాయము 7

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 రాజకుమార పుత్రికా, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు! నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి.

02 నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితిపడకుండును గాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి

03 నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి.

04 నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము.

05 నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి. రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు.

06 నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో నీవు అతిసుందరమైనదానవు అతి మనోహరమైనదానవు.

07 నీవు తాళవృక్షమంత తిన్నని దానవు నీ కుచములు గెలలవలె నున్నవి.

08 తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్ష గెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది.

09 నీ నోరు శ్రేష్ట ద్రాక్షారసమువలె నున్నది ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యధరములు ఆడజేయును.

10 నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు.

11 నా ప్రియుడా, లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము.

12 పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షావల్లులు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమచెట్లు పూతపట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను

13 పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధములమీద వ్రేలాడుచున్నవి.